అగ్నిపునీత: అణచివేత అగాధంలో ఆడజన్మ
సృష్టికి మూలం స్త్రీ. ఒక నవజాత శిశువు తొలి శ్వాసలో అమ్మ ఉంది, ఒక విత్తనం మొలకెత్తే మట్టిలో మాతృత్వం ఉంది. కానీ, దురదృష్టవశాత్తు అదే స్త్రీ, తాను సృష్టించిన సమాజంలోనే ఒక 'అపరిచితురాలిగా', ఒక 'అణగారిన ప్రాణిగా' మిగిలిపోతోంది. యుగయుగాలుగా సాగుతున్న ఈ లింగ వివక్ష కేవలం ఒక సామాజిక రుగ్మత కాదు, అది మానవ నాగరికతకే ఒక తీరని మచ్చ. స్త్రీ అంటే కేవలం ఒక శరీరం కాదు, ఆమె ఒక ఆలోచన, ఒక ఆశయం, ఒక అపరిమిత శక్తి. కానీ ఈ పురుషాధిక్య ప్రపంచం ఆమె రెక్కలను కత్తిరించి, గూటికే పరిమితం చేస్తూ, ఆమె ఆకాశాన్ని దొంగిలిస్తోంది.
ఆడపిల్ల పుట్టబోతోందని తెలియగానే, గర్భగుడినే సమాధిగా మార్చే కర్కశత్వం ఈ నేల మీద ఇంకా సజీవంగానే ఉంది. లోకాన్ని చూడకముందే నూతిలోనో, పూతిలోనో కలిసిపోతున్న అభాగ్య ప్రాణాల హాహాకారాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒకవేళ అదృష్టవశాత్తు భూమి మీద అడుగుపెట్టినా, ఆ చిన్నారికి లభించే స్వాగతం నిట్టూర్పులతోనే మొదలవుతుంది. "అయ్యో.. మళ్లీ ఆడపిల్లేనా?" అన్న మాట ఆమె కర్ణభేరిని తాకే తొలి బాణం.
అక్కడి నుంచే వివక్షా పర్వం ప్రారంభమవుతుంది. అన్నకో తమ్ముడికో లభించే పాలు, పండ్లు ఈమెకు దక్కవు. వాడు రాజకుమారుడిలా పెరగాలి, ఈమె మాత్రం రేపు ఇంకో ఇంటికి వెళ్లే 'పరాయి సొత్తు'గా, వంటింటి పనిముట్టుగా తీర్చిదిద్దబడాలి. ఈ వివక్ష ఆమె నడకలో, నవ్వులో, మాటలో ప్రతిచోటా అదృశ్య సంకెళ్లు వేస్తుంది.
మట్టిలో మాణిక్యమై పుట్టినా.. మసి పూసి మరుగున పడేశావు
ఆకాశమంత ఆశను గుండెల్లో దాచుకుంటే.. అడుగు బయటపెట్టనివ్వని ఆంక్షలు వేశావు
నువ్వు గీసిన గీతలే నా బతుకు చిత్రపటాలైతే.. నా ఉనికికి అర్థమేముంది ఓ సమాజమా?
చదువుల తల్లి అని సరస్వతిని పూజించే ఈ సమాజం, ఇంట్లో ఉన్న ఆడపిల్ల చేతికి పుస్తకం ఇవ్వడానికి వంద సార్లు ఆలోచిస్తుంది. "చదువుకుని ఏం చేస్తావు? రేపు వంట గదిలో గరిట తిప్పాల్సిందేగా!" అనే వెటకారపు మాటలు ఆమె మేధస్సును అవమానిస్తాయి. బడికి పంపినా, అక్కడ కూడా రక్షణ లేని వాతావరణం. దారి పొడుగునా వేధించే కళ్లు, విసిరే అసభ్య పదజాలం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
అంతా దాటి కాలేజీ మెట్లు ఎక్కినా, పెళ్లి అనే పేరిట ఆమె కలల మీద కట్టుబట్టలతో నీళ్లు చల్లేస్తారు. ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, ఒక వస్తువులా మార్పిడి చేసే వివాహ వ్యవస్థలో స్త్రీ ఒక మూగజీవిగా మిగిలిపోతోంది. కట్నం అనే రక్కసి ఆమె తల్లిదండ్రుల వెన్ను విరిస్తే, అత్తారింటి వేధింపులు ఆమె ప్రాణాలనే తీస్తున్నాయి.
ఉద్యోగ రంగంలోకి అడుగుపెడితే అక్కడ మరో మాయాజాలం. పురుషుడితో సమానంగా కష్టపడినా, పదోన్నతుల్లో ఆమెకు మొండిచేయి ఎదురవుతుంది. ఆమె నైపుణ్యం కంటే ఆమె లింగం గురించే చర్చ జరుగుతుంది. "ఆడవాళ్లు కష్టమైన పనులు చేయలేరు", "వాళ్లకు ఇంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి సీరియస్‌గా తీసుకోరు" అనే ముందస్తు ముద్రలు ఆమె కెరీర్‌ను నాశనం చేస్తాయి.
వేతనాల విషయంలో కూడా వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే పనికి పురుషుడికి ఒక రేటు, స్త్రీకి మరో రేటు. ఇది శ్రమ దోపిడీ కాదా? ఇది ఆమె మేధస్సును కించపరచడం కాదా? రాత్రి పూట పని చేయాలంటే భయం, ఒంటరిగా ప్రయాణించాలంటే వణుకు.. ఇవన్నీ ఆధునిక సమాజం ఆమెకు ఇచ్చిన బహుమతులు.
సామాజికంగా చూస్తే, స్త్రీకి 'పవిత్రత' అనే ఒక భారాన్ని మోపుతారు. పురుషుడు ఏం చేసినా చెల్లుతుంది, కానీ స్త్రీ చిన్న తప్పు చేసినా ఆమె క్యారెక్టర్‌ను ముక్కలు ముక్కలు చేస్తారు. బట్టల దగ్గర నుంచి, స్నేహితుల వరకు ప్రతిదీ సమాజమే నిర్ణయిస్తుంది. ఆమె ఏడవకూడదు, గట్టిగా నవ్వకూడదు, ఎదురు చెప్పకూడదు..
ఇన్ని 'కూడదు'ల మధ్య ఆమె అస్తిత్వం ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. గృహ హింస అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారి. చదువుకున్న వారు, చదువుకోని వారు అనే తేడా లేకుండా ప్రతి ఇంటా ఆడది ఏదో ఒక రూపంలో హింసకు గురవుతూనే ఉంది. శారీరక గాయాల కంటే మనసుకు తగిలే గాయాలు ఆమెను నిలువునా దహించివేస్తున్నాయి. అయినా సరే, పిల్లల కోసం, కుటుంబం కోసం వాటన్నింటినీ దిగమింగుతూ చిరునవ్వు చిందించడం కేవలం స్త్రీకే సాధ్యం.
కన్నీటిని కడలిలా దాచుకుని.. నవ్వుల వెన్నెలను పంచే దేవతవు..
నీ ఓరిమిని బలహీనతగా చూస్తున్న ఈ లోకానికి..
నీలోని కాళిని చూపించే సమయం ఆసన్నమైంది!
నివురు గప్పిన నిప్పువు నువ్వు.. నిశీధిని చీల్చే సూర్యుడివి నువ్వు!
ఈ వివక్షా అంధకారం నుంచి విముక్తి ఎప్పుడు? ఎప్పుడైతే ఒక తండ్రి తన కొడుకుకి 'స్త్రీని గౌరవించడం' నేర్పిస్తాడో, ఎప్పుడైతే ఒక భర్త తన భార్యను 'సమాన భాగస్వామి'గా చూస్తాడో, ఎప్పుడైతే ఒక బాస్ తన ఉద్యోగినిని 'మెరిట్' ప్రాతిపదికన గుర్తిస్తాడో.. అప్పుడే మార్పు మొదలవుతుంది. చట్టాలు ఎన్ని వచ్చినా, మనసుల్లోని మాలిన్యం పోనంత వరకు స్త్రీకి పూర్తి స్వేచ్ఛ లభించదు.
స్త్రీ అంటే కేవలం ఒక శరీరం కాదు, ఆమె ఒక అగ్ని శిఖ. ఆ శిఖను ఆర్పే ప్రయత్నం చేస్తే సమాజమే భస్మమవుతుంది. ఆమెను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. ఆమెకు ఆకాశాన్ని ఇవ్వకండి, కనీసం ఆమెను ఎగరనివ్వండి. ఆమెకు దారి చూపకండి, కనీసం ఆమె వెళ్లే దారిలో ముళ్లు చల్లకండి.
ముగింపుగా.. ఓ మహిళా! నువ్వు అబలవు కావు, సబలవు. నీ శక్తిని నువ్వు గుర్తించు. ఈ సమాజం వేసే సంకెళ్లను నీ జ్ఞానంతో, ధైర్యంతో తెంచుకో. నువ్వు పుట్టినందుకు గర్వించు, నీ ఉనికిని చాటుకో. లింగ వివక్ష అనే పేజీని చరిత్ర పుటల నుంచి తుడిచివేసి, సమానత్వం అనే కొత్త అధ్యాయాన్ని లిఖించు. ప్రపంచం నీ వైపు చూస్తోంది, నువ్వు విజేతగా నిలవాలి. ఈ అక్షర కావ్యం నీ ఆవేదనకు ప్రతిరూపం, నీ పోరాటానికి ఒక ఆయుధం.
-కీర్తి గోవిందు.
Comments
Post a Comment