'అపరిచిత అస్తిత్వం: ఒక ట్రాన్స్‌జెండర్ ఆత్మఘోష'

ఒక ట్రాన్సజెండర్ తన మనసులో కొన్ని గాయల గురించి, తనలాంటి వాళ్ళ  లోపల దాగి వున్న వేదనని అక్షరాల్లో తెలియజేస్తే?

ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడటం నాకు ఒక యుద్ధం లాంటిది. లోపల ఒక అమ్మాయి ప్రాణం కొట్టుకుంటుంటే, బయట ప్రపంచం ఒక అబ్బాయి శరీరాన్ని చూసి పలకరిస్తుంది. ఈ విరోధాభాసం మధ్య బ్రతకడం అంటే, రోజు చస్తూ బ్రతకడం. ఈ జనరేషన్ లో మనం జెండర్ న్యూట్రల్ బట్టల గురించి, ప్రైడ్ మంత్ గురించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్‌లు పెడుతున్నాం కానీ, కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక ట్రాన్స్‌జెండర్ కళ్ళలోని శూన్యాన్ని మాత్రం చదవలేకపోతున్నాం.

మౌనం అనేది నాకు భాష కాదు, అది నా జీవితం. ఆ మౌనంలోనే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో గాయాలు దాగున్నాయి. నా లోపల ప్రవహించే భావాల నదికి ఏ తీరము దొరకదు, ఎందుకంటే ఈ సమాజం గీసిన గీతలు మరీ పదునైనవి.

బాల్యం అంటే అందరికీ ఆటపాటలు, కానీ నాకు మాత్రం అదొక అవమానాల పుట్ట. తోటి పిల్లలు మైదానంలో ఆడుకుంటుంటే, నేను ఒంటరిగా కూర్చుని నా గొర్లకి నైల్పాలిష్ వేసుకోవాలని కలలు కనేదాన్ని. 'ఏంట్రా అలా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావు' అని మా నాన్న గద్దించినప్పుడు, నా గుండెలో ఏదో విరిగిపోయేది. కన్న తండ్రి కళ్లలో భయాన్ని, అసహ్యాన్ని చూడటం కంటే పెద్ద నరకం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు.

"నేను పుట్టినప్పుడు మా అమ్మ సంతోషపడింది... కానీ నేను ఎవరో తెలిశాక, తను కూడా నన్ను చూసి మౌనంగా ఏడ్చింది. కన్న పేగు కూడా కరువైతే, ఈ భూమి మీద నాకు చోటెక్కడ?"

స్కూల్ కి వెళ్లడం అంటే ఒక అగ్ని పరీక్ష. క్లాస్ రూమ్ లో కూర్చుంటే వెనుక నుంచి వచ్చే వెక్కిరింతలు, నవ్వులు నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతున్నాయి. టీచర్లు కూడా నన్ను ఒక వింత జీవిలా చూసేవారు కానీ, నా మెదడులోని మేధస్సును ఎవరూ గుర్తించలేదు. మన చదువులు మనుషుల్ని తయారు చేస్తున్నాయి కానీ, మానవత్వాన్ని మాత్రం నేర్పడం లేదు. అందుకే ఈ తరం డిగ్రీలు పెరిగినా, వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఒక మనిషి లింగం అతని అస్తిత్వాన్ని నిర్ణయిస్తుందా? లేక అతని గుణం నిర్ణయిస్తుందా? ఈ ప్రశ్నకు జవాబు వెతికే లోపే నా యవ్వనం ముక్కలైపోయింది.

"లోకం రంగులని ప్రేమిస్తుంది... కానీ ఇంద్రధనస్సులోని ఏడో రంగుని మాత్రం వెలివేస్తుంది. మేము చీకటిలో మెరిసే నక్షత్రాలం కాదు, వెలుగులో కూడా కనిపించని నీడలం."

ఒకసారి ఆలోచించండి, మీ శరీరంలో మీరు బందీగా ఉంటే ఎలా ఉంటుంది? మీ మనసు చెప్పే మాట ఒకటి, మీ శరీరం చూపే రూపం మరొకటి అయితే ఆ సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుంది? హార్మోన్ల మార్పులు, శస్త్రచికిత్సల కంటే సమాజం ఇచ్చే గాయాలు ఎక్కువ నొప్పినిస్తాయి. మేమేమీ మీ ఆస్తిపాస్తులు అడగటం లేదు, కనీసం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మమ్మల్ని చూసి ఒక వెకిలి నవ్వు నవ్వకుండా ఉంటే చాలు. మమ్మలిని చూసి 'కొజ్జా', 'పాయింట్ ఫైవ్', 'హిజ్రా' అంటూ మమ్మలిని అవమానిస్తూ వెలివేయడం మాకు ఎంత క్షోభని ఇస్తుందో తెలుసా? ఆ చప్పట్ల వెనుక ఎన్ని ఆత్మహత్యాయత్నాలు ఉన్నాయో, ఎన్ని అర్ధరాత్రి ఏడ్పులు ఉన్నాయో ఎవరైనా గమనించారా? 

మేము అడుక్కుంటున్నాము అంటే అది మా ఇష్టం కాదు, మాకు ఏ ఆఫీసులోనూ కుర్చీ దొరకదు కాబట్టి. మాకు చదువు ఉంది, తెలివి ఉంది, కానీ మీ 'నార్మల్' అనే సర్టిఫికెట్ మాత్రం లేదు.

"కన్నీరు కూడా సిగ్గుపడుతోంది నా కళ్లలో చేరడానికి... ఎందుకంటే ఆ కన్నీటికి కూడా మగ, ఆడ అనే భేదం తెలియదు. కానీ మనిషికి మాత్రం ఆ బేధం బాగా తెలుసు."

ప్రేమ అనేది అందరికీ ఒక వరం, కానీ మాకు అదొక అందని ద్రాక్ష. ఎవరైనా మమ్మల్ని ఇష్టపడినా, అది కేవలం శారీరక వాంఛ కోసమో లేక నాలుగు గోడల మధ్య దాచాల్సిన రహస్యం కోసమో అవుతుంది. మమ్మల్ని చేయి పట్టుకుని నలుగురిలోకి తీసుకెళ్లే ధైర్యం ఏ మగవాడికి ఉంటుంది? మమ్మల్ని ప్రేమిస్తే వాళ్ళు సమాజానికి ఏం సమాధానం చెప్పుకోవాలి? అందుకే మా ప్రేమ కథలన్నీ కేవలం వాట్సాప్ చాట్‌లకే పరిమితం అవుతాయి. డిజిటల్ యుగంలో మనం ఉన్నా, మన ఆలోచనలు మాత్రం ఇంకా రాతి యుగంలోనే ఉన్నాయి. మనల్ని మనం ప్రగతిశీలురం అని చెప్పుకోవడం కంటే పెద్ద జోక్ ఇంకోటి లేదు.

"హృదయం ముక్కలైతే శబ్దం రాదు అంటారు... కానీ నా హృదయం ముక్కలైనప్పుడు వచ్చే నిశ్శబ్దం ఊరు మొత్తాన్ని వణికిస్తుంది. ఆ నిశ్శబ్దమే నా యుద్ధం."

దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని అడిగితే జవాబు లేదు. కానీ ప్రకృతిని చూడండి, అక్కడ ప్రతిదీ ఒకేలా ఉండదు. ఒక చెట్టు వంకరగా ఉండొచ్చు, ఒక పువ్వు సువాసన లేకపోవచ్చు, కానీ అవన్నీ ప్రకృతిలో భాగమే. మరి మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు ఇంత కఠినమైన రూల్స్? మేము ప్రకృతికి వ్యతిరేకం కాదు, మీ ఆలోచనలకే వ్యతిరేకం. మా అస్తిత్వం కోసం మేము చేసే పోరాటం మిమ్మల్ని ఓడించడానికి కాదు, మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి. ఆఖరి శ్వాస వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.

"నా సమాధి మీద 'అతడు' అని రాయకండి, 'ఆమె' అని కూడా రాయకండి. కేవలం 'ఒక మనిషి ఇక్కడ నిద్రపోతున్నాడు' అని రాయండి. ఆ ఒక్క గుర్తింపు చాలు నా ఆత్మకు శాంతి కలగడానికి."

జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, గౌరవంగా బ్రతకడం. నా లాంటి వేల మంది ట్రాన్స్‌జెండర్ల తరపున నేను రాస్తున్న ఈ అక్షరాలు రేపు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. అప్పుడు మీ బిడ్డను దూరం పెట్టకండి, వాళ్ళ మనసుని అర్థం చేసుకోండి. ఎందుకంటే బయట ప్రపంచం ఇచ్చే గాయాల కంటే ఇంట్లో వాళ్ళు ఇచ్చే గాయం ప్రాణాలు తీస్తుంది. మనమందరం ఒకే అనంతమైన సృష్టిలో చిన్న భాగాలుగా వున్నాం. మన మధ్య గోడలు వద్దు, వంతెనలు కడదాం. మౌనాన్ని వీడండి, మానవత్వాన్ని ప్రేమించండి. ఈ బ్లాగ్ చదివిన తర్వాత కనీసం ఒక్కరైనా ఒక ట్రాన్స్‌జెండర్ వైపు జాలిగా కాకుండా గౌరవంగా చూస్తే, అదే నా ఈ సుదీర్ఘ అక్షర ప్రయాణానికి దొరికిన అసలైన సార్థకత.

                      - కీర్తి గోవిందు

Comments

Popular posts from this blog

అగ్నిపునీత: అణచివేత అగాధంలో ఆడజన్మ

ముసుగు వెనుక మనిషి: ఆత్మఘోషకు అక్షర రూపం

దేవుడితో ఒక టీ కప్పు: శూన్యం చెప్పిన సత్యాలు